: అత్యంత సమగ్రంగా 'హోదా' ప్రకటన... రైల్వే జోన్ కూడా!
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేకూర్చేలా కేంద్రం తయారు చేసిన ముసాయిదా విభజన హామీలను అన్నింటినీ ప్రస్తావిస్తూ అత్యంత సమగ్రంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిలో 'హోదా' అన్న పదం ఉంటుందా? అన్నది స్పష్టం కానప్పటికీ, హోదా వస్తే లభించే అన్ని ప్రయోజనాలకూ చోటు కల్పించినట్టు తెలుస్తోంది. విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో పెండింగులో ఉన్న వాటన్నింటినీ ఇందులో చేర్చినట్టు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ప్రజల సెంటిమెంట్ గా మారడం, రాజీపడబోమని చంద్రబాబు చెప్పడం, హోదా ఇవ్వకపోవడంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న నిరసనలతో మెట్టు దిగిన కేంద్రం రాష్ట్రంపై దృష్టి సారించి వరుస భేటీలు జరిపి ఈ ప్రతిపాదనలను తయారు చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్, హామీల అమలు దిశగా చేయాల్సిన కార్యక్రమాలు, మరిన్ని విద్యాసంస్థలు, పారిశ్రామిక రాయితీలు తదితర అంశాలను పొందుపరిచినట్టు తెలుస్తోంది. హోదా ఇస్తే కలిగే రాయితీల ప్రయోజనాలను విడిగా ఇస్తామని వివరణాత్మకంగా చెబుతూ, ఆర్థిక, మౌలిక వసతుల కల్పనకు, పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు గురించిన సమాచారం కూడా ఈ ముసాయిదాలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.