: ప్రపంచంలోనే ఈ శునకం అదృష్టవంతురాలు... ఎందుకో మీరే చూడండి!
ఈ వీడియో చూశాక దీనంత అదృష్టవంతురాలు ప్రపంచంలోనే మరొకటి ఉండదని అనుకోకుండా ఉండలేరు. కారు కింద పడి తునాతునకలైపోవాల్సిన ఓ శునకం ఆశ్చర్యకరంగా చిన్నగాయం కూడా కాకుండా తప్పించుకోవడం నిజంగా అద్భుతమనే అనాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సెలవుదినం కావడంతో ఆదివారం బొలీవియాలో ‘కొడాసర్- 2016’ పేరుతో కార్ రేసింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు చిన్నారుల దగ్గరి నుంచి పెద్దల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గతుకుల మట్టిరోడ్డుపై ఈ రేసింగ్ పోటీలు జరుగుతున్నాయి. కార్లు మెరుపువేగంతో దూసుకుపోతున్నాయి. రయ్ మంటూ కార్లు రోడ్డుపై దూసుకెళ్తుండడంతో భయపడిన ఓ శునకం రోడ్డుపైకి వచ్చి పరుగులు తీస్తోంది. ఈలోగా మరోకారు వేగంగా దూసుకువస్తోంది. దీనిని చూసినవారు కాసేపు భయపడ్డారు. కుక్క మీది నుంచి కారు దూసుకుపోవడం ఖాయమని అనుకున్నారు. ఈ దారుణాన్ని చూడడం ఇష్టం లేని కొందరు కళ్లు మూసుకున్నారు. సరిగ్గా అప్పుడే జరగరాని అద్భుతం జరిగింది. సరిగ్గా శునకాన్ని సమీపిస్తున్న తరుణంలో కారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కుక్కను దాటాక నేలపై పడింది. దీనిని చూసినవారు ఆనందాశ్చర్యాలతో కేరింతలు కొట్టారు. చనిపోతుందనుకున్న శునకం అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాకుండానే తన దారిన తాను వెళ్లిపోయింది. కారు యథావిధిగా అదే వేగంతో దూసుకుపోయింది. ఇప్పుడు చెప్పండి. ఇది మిరాకిల్ కదూ!