: 101 ఏళ్ల వయస్సులో ప్రపంచ పర్యటనకు సిద్ధమైన బామ్మ!
ఎప్పటికైనా హాయిగా ప్రపంచాన్ని చుట్టిరావాలని ఎంతో మంది అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ కలను నెరవేర్చుకుంటారు. ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య పరిస్థితులు, వయసు మీరడం వంటి కారణాల వల్ల వారి కల నెరవేరకపోవచ్చు. కానీ చైనాలోని జియాంగ్సూ ప్రాంతానికి చెందిన 101 ఏళ్లు నిండిన లియు అనే బామ్మలో మాత్రం ప్రపంచాన్ని చుట్టిరావాలన్న కోరిక ఏ మాత్రం తగ్గలేదు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించిన ఈ బామ్మ కుటుంబం ఇప్పుడు బాగా స్థిరపడింది. దీంతో ఇటీవల ఆమె ఒంటిరిగానే చైనా అంతా పర్యటించేసింది. అయితే మొత్తం ప్రపంచ పర్యటన చేయాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలన్నీ కొనసాగిస్తోంది. ఈ వయసులో దాని కోసం పాస్‌పోర్టును తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమను అల్లారు ముద్దుగా పెంచిన బామ్మకల నెరవేరేలా చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. బామ్మ ప్రపంచ పర్యటన చేసేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఆమె కళ్లల్లో ఆనందం నింపారు. తాజాగా బామ్మ పాస్‌పోర్టు పొందడంతో ఇక ఆమె త్వరలో జపాన్ నుంచి కొరియా మీదుగా ప్రపంచాన్ని చుట్టేయడానికి వెళ్లనుంది. ప్రపంచ పర్యటన చేయడం బామ్మ వంతయితే బామ్మ ఈ వయసులో చేస్తోన్న సాహసాన్ని చూసి ఆశ్చర్యపోవడం ఈ విషయాన్ని తెలుసుకున్న వారి వంతవుతోంది. తాను తాజాగా పొందిన పాస్ పోర్టును మీడియాకు చూపిస్తూ తన కల నెరవేర్చుకోబోతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేసింది. బామ్మకు హ్యాపీ జర్నీ అంటూ టాటా చెప్పడానికి కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.