: సైనిక కేంద్రాలు, స్థావరాలను పంచుకునేందుకు అమెరికాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఇండియా
అమెరికాతో భారత్ కుదుర్చుకున్న అత్యంత కీలక ఒప్పందంలో భాగంగా, ఇరు దేశాలు సైనిక కేంద్రాలు, స్థావరాలను పంచుకోనున్నాయి. యుద్ధ విమానాలు, నౌకలు, సైనికుల అవసరాలను తీర్చేందుకు ఒకరి బేస్ లను మరోకరు వాడుకోవచ్చని, ఇక్కడ మరమ్మతులు చేసుకోవడం, ఇంధనం నింపుకోవడం, విశ్రాంతి తీసుకోవడం తదితరాలు చేసుకోవచ్చని అమెరికా, భారత్ లు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అమెరికా పర్యటనలో భాగంగా ఈ డీల్ కుదిరింది. డీల్ పై సంతకాల అనంతరం అమెరికా రక్షణ మంత్రి ఆష్ కార్టర్ ప్రసంగిస్తూ, ఇరు దేశాల మధ్యా ఉన్న స్నేహబంధం మరింతగా బలపడిందని అన్నారు. అమెరికా, భారత్ ల రక్షణ బంధంలో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న వేళ, రెండు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందం చైనాను కొంతమేరకు అడ్డుకోగలుగుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు. పారికర్ మాట్లాడుతూ, "రెండు దేశాల మధ్యా స్వేచ్ఛా వాణిజ్యం జరగాలన్నది భారత అభిమతం. ఇండో - పసిఫిక్ మార్గంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నౌకలు తిరగాలి. అందుకు అమెరికా, భారత్ లు కలసి పనిచేస్తాయి" అని చైనా పేరును వెల్లడించకుండా వ్యాఖ్యలు చేశారు. తన పర్యటనలో భాగంగా ఫిలడెల్ఫియాలోని బోయింగ్ విమానాల తయారీ కేంద్రాన్ని సందర్శించిన పారికర్, ఆపై యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు.