: జేఈఈలో దుమ్మురేపిన పేద విద్యార్థులు.. ప్రతిభకు ఏవీ అడ్డుగోడలు కావని నిరూపించిన వైనం!
ప్రతిభకు పేదరికం ఎంతమాత్రమూ అడ్డం కాదని నిరూపించారు ఈ విద్యార్థులు. పలు అడ్డంకులను అధిగమించి జేఈఈ-2016లో ర్యాంకులు కొల్లగొట్టి ఐఐటీల్లో సీట్లు సంపాదించారు. వారి లక్ష్యం ముందు ఆర్థిక ఇబ్బందులు చిన్నబోయాయి. వారి కష్టానికి తలొగ్గి విజయానికి బాటలు వేశాయి. దేశవ్యాప్తంగా ఏడువేల మంది విద్యార్థులు ఈ ఘతన సాధించారు. ర్యాంకులు సాధించిన వెయ్యి మంది విద్యార్థుల తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం గమనార్హం. 5 వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులు మెట్రిక్యులేషన్ చదువుకోగా 14,619 మంది విద్యార్థుల తల్లిదండ్రులు గ్రాడ్యుయేషన్ చదువుకున్నారు. ఏడువేల కుటుంబాల వార్షిక ఆదాయం లక్ష రూపాయలలోపే. 5,500 మంది విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం మాత్రం రూ.8 లక్షలు. అయితే, దేశవ్యాప్తంగా ర్యాంకులు సాధించిన విద్యార్థుల జాబితాలో టాప్-5లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పేర్లు కనిపించలేదు. ఈ విషయంలో 5,385 మందితో రాజస్థాన్ తొలిస్థానంలో ఉండగా 5,050తో ఉత్తరప్రదేశ్, 3,099 మందితో మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.