: కులమతాలపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హెచ్చార్సీలో ఫిర్యాదు
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హెచ్చార్సీలో ఫిర్యాదు నమోదైంది. ఈ నెల 27న తిరుపతిలో నిర్వహించిన బహిరంగసభలో పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్ హైదరాబాదులోని సుల్తాన్ బజార్ లో ఉన్న హెచ్చార్సీలో ఫిర్యాదుచేశారు. తనకు కులాలు, మతాలు రుద్దితే అరికాళ్ల నుంచి నషాళానికి ఎక్కుతుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లను ఏర్పాటు చేసి రిజర్వేషన్లు అమలు చేస్తుండగా, వారి హక్కులకు భంగం కలిగేలా పవన్ మాట్లాడారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పవన్ కల్యాణ్ ను అడ్డంపెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.