: పాకిస్థాన్ మరో ఉల్లంఘన.. భారత గగనతలంపై దాయాది విమానం చక్కర్లు
పాకిస్థాన్ మరోమారు ఉల్లంఘనకు పాల్పడింది. భారత గగన తలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ విమానమొకటి యథేచ్ఛగా చక్కర్లు కొట్టింది. జమ్ముకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాక్ విమానం భారత్ గగనతలంలోకి ఎందుకు చొరబడింది? ఏం చేసిందనే దానిని నిర్ధారించేందుకు భారత వైమానిక రాడార్లు శోధిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పాకిస్థాన్ విమానమొకటి భారత్‌లో ప్రవేశించడాన్ని గమనించిన ఓ జవాను వెంటనే విషయాన్ని అధికారులకు చేరవేశాడు. వెండి రంగులో ఉన్న చిన్న విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిందని ఆయన పేర్కొన్నాడు. దాదాపు నిమిషం పాటు అది చక్కర్లు కొట్టినట్టు తెలిపాడు. అయితే అది పాకిస్థాన్ ఆర్మీకి చెందిన పైలట్ సహిత విమానమా? లేక మానవ రహిత విమానమా? అన్నది నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. నిజానికి గగనతల ఉల్లంఘనలను నివారించేందుకు భారత్, పాకిస్థాన్ దేశాలు అంతర్జాతీయ సరిహద్దులో నాలుగైదు కిలోమీటర్ల దూరాన్ని పాటిస్తుంటాయి.