: మళ్లీ వార్తల్లోకి వచ్చిన ఎల్టీటీఈ ప్రభాకరన్ పేరు!
శ్రీలంక సైన్యం హతమార్చిన ది లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మళ్లీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చాడు. కనిపించకుండా పోయిన వారి కోసం శ్రీలంక ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్ (ఓఎమ్పీ) కు ప్రభాకరన్ పేరును సూచించనున్నానంటూ శ్రీలంక తమిళ్ నేషనల్ అలయన్స్ నాయకుడు ఎమ్.శివలింగం చేసిన వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి. మే 19, 2009న ప్రభాకరన్ (54)ను హతమార్చినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. జాఫ్నాపై దాడి చేసిన సమయంలో బాంబుదాడిలో ఆయనను హతమార్చినట్టు పేర్కొంటూ ఫోటోలు కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శివలింగం చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. శ్రీలంకలోని ప్రభాకరన్ సోదరుడు లేదా సోదరి కానీ ఓఎమ్పీలో పేరును నమోదు చేయాలనుకుంటే తాను వారికి అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. యూఎన్ మానవహక్కుల పాలక సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఓఎమ్పీని స్థాపించనున్నట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై అక్కడి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓఎమ్పీ స్థాపన అంటే ఎల్టీటీఈతో పోరాడిన సైనికులను మోసం చేయడమేనని వారు పేర్కొంటున్నారు. ఎల్టీటీఈతో 2009లో పోరు ముగించిన తరువాతి నుంచి ఇప్పటి వరకు సుమారు 16వేల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరికొందరిపై శ్రీలంక సైన్యం చేసిన దాష్టీకాలు వెలుగులోకి వచ్చి పెను కలకలం రేగిన సంగతి తెలిసిందే.