: ట్రంప్ గెలవాలని కోరుతున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు!


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ను గెలిపించాలని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కోరుకుంటున్నారని ఐసిస్ మీడియా సంస్థ తెలిపింది. ఈ మేరకు పలువురు ఉగ్రవాదుల ఇంటర్వ్యూలు ప్రసారం చేసింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని వారు కోరుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికా తనంతట తానుగా పతనమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ట్రంప్ నిలకడ లేని మనిషని, చంచల స్వభావంతో ఆయన తీసుకునే దూకుడు నిర్ణయాలు అమెరికాను బలహీనపరుస్తాయని వారు పేర్కొంటున్నారు. ముస్లింలను తీవ్రంగా ద్వేషించే ట్రంప్ వారికి వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంటాడని, తద్వారా ముస్లిం సమాజం మొత్తం ఏకతాటిపైకి వస్తుందని, అది తమకు ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. అలా జరిగినప్పుడు ముస్లిం సమాజం, యాంటీ ముస్లిం సమాజం అంటూ ప్రపంచం రెండుగా చీలుతుందని, దీంతో ఈ రెండు వర్గాల మధ్య యుద్ధం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. అందుకే ట్రంప్ గెలవాలని వారు కోరుతున్నారు. హిల్లరీ ఇంత వరకు ముస్లింలకు వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదని, దీంతో ఆమె తమకు పూర్తి వ్యతిరేకంగా పని చేసే అవకాశం లేదని ఉగ్రవాదులు పేర్కొనడం విశేషం. అందుకే ట్రంప్ ను అమెరికన్లు గెలిపిస్తారని ఆశిస్తున్నామని, ట్రంప్ ను గెలిపించాలని ప్రార్ధిస్తున్నామని పలువురు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News