: మోదీ, వెంకయ్య, కేసీఆర్.. ఎవరు తలచుకున్నా ఆ కేసు నుంచి చంద్రబాబును కాపాడలేరు: అంబటి రాంబాబు


ఓటుకు నోటు కేసు నుంచి ఏపీ సీఎం చంద్రబాబును ఎవరూ కాపాడలేరని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరు తలచుకున్నప్పటికీ ఈ కేసు నుంచి చంద్రబాబును కాపాడలేరని అన్నారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసుకు సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామక‌ృష్ణా రెడ్డి అన్ని సాక్ష్యాలతో కోర్టును ఆశ్రయించారన్నారు. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయన్నారు. ఈ కేసు నుంచి చంద్రబాబును రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రయత్నించిందని, దీనికి ప్రతిఫలంగానే చంద్రబాబు ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఈ కేసు జరిగి 14 నెలలు గడిచినా తెలంగాణ ప్రభుత్వం అదనపు ఛార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రత్యేకహోదాతో పాటు పలు అంశాలపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ సందర్భంగా నిర్వహించే సేవా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొనాలని అంబటి రాంబాబు కోరారు.

  • Loading...

More Telugu News