: నన్ను తలచుకోకుండా పవన్ కల్యాణ్ ఉండలేరు... కౌంటరేసిన కేశినేని నాని!


హిందీ, ఇంగ్లీష్ రాని మన ఎంపీలు పార్లమెంటులో తెలుగులో మాట్లాడుతున్నారని, ప్రధానిని నిత్యమూ సార్ సార్ అని సంబోధిస్తూ రాష్ట్రానికి హోదాను గట్టిగా డిమాండ్ చేయడంలో విఫలమవుతున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని స్పందించారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, పెద్దలను గౌరవించాలి కాబట్టే ప్రధానిని సార్ అని సంబోధిస్తున్నానని, తెలుగు ప్రజలకు అర్థం కావాలనే తెలుగులో మాట్లాడతానే తప్ప, తనకు ఇంగ్లీష్, హిందీ తెలుసునని అన్నారు. పవన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా తన పేరును ఓసారి తలచుకుని ప్రజలకు తన నోటి ద్వారా గుర్తు చేస్తుంటారని ఎద్దేవా చేశారు. హోదాను తక్షణం తీసుకువచ్చేలా పవన్ వద్ద వ్యూహం ఉంటే వెంటనే బయటపెట్టాలని, ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలతో ఒరిగేదేమీ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హోదాపై పోరాటం అంటే రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు కాదని, పవన్ ఢిల్లీ వెళ్లి మోదీ ఇంటి ముందు సభ పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసి విభజన బిల్లును ఆమోదించుకుందని, ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని అన్నారు. కేంద్ర మంత్రి పదవులు తమకు ముఖ్యం కాదని, సీఎం నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా, తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నాని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News