: స్కార్పీన్ సబ్ మెరైన్ సీక్రెట్స్ ఇవి... ప్రచురించిన 'ది ఆస్ట్రేలియన్'


గత వారంలో లీకైన స్కార్పీన్ జలాంతర్గాముల్లో రూపొందించిన క్షిపణి వ్యవస్థ వివరాలను సేకరించిన 'ది ఆస్ట్రేలియన్' వాటిల్లోని కొంత భాగాన్ని ప్రచురించగా, వీటిని తయారు చేసి భారత్ కు అందిస్తున్న ఫ్రెంచ్ సంస్థ డీసీఎన్ఎస్, మరింత డేటాను విడుదల చేయకుండా చూడాలంటూ న్యూ సౌత్ వేల్స్ సుప్రీంకోర్టులో ఇంజక్షన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. అత్యంత సున్నితమైన ఈ వివరాలు బయటకు వస్తే, తమ క్లయింట్ గా ఉన్న భారత నావికా దళానికి నష్టం కలుగుతుందని డీసీఎన్ఎస్ వాదించనుంది. ఇక ఏ విధమైన వివరాలు ప్రచురించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరనున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, స్కార్పీన్ సబ్ మెరైన్లలో ఎస్ఎం 39 యాంటీ షిప్ మిసైల్స్ ను వాడుతున్నారని చెబుతూ, ఒకేసారి ఎన్ని నౌకలను స్కార్పీన్ నుంచి టార్గెట్ చేయవచ్చన్న వివరాలతో పాటు వాటిని ప్రయోగించే ముందు తీసుకునే చర్యలను 'ది ఆస్ట్రేలియన్' ప్రచురించింది. భారత న్యావీ సబ్ మెరైన్లను వాడే విధానాన్ని కళ్లముందుంచింది. అందులో ఉండే రాడార్ల శక్తి, ఎంత దూరంలోని నౌకలను గుర్తించగలుగుతుందన్న వివరాలు ఇచ్చింది. తమ వద్ద మరింత సమాచారం ఉందని చెప్పడంతో ముందస్తు చర్యల్లో భాగంగా మరిన్ని కథనాలు వద్దని చెబుతూ, డీసీఎన్ఎస్ కోర్టుకు ఎక్కనుంది. దాదాపు రూ. 20 వేల కోట్ల వ్యయంతో మొత్తం ఆరు సర్కార్పీన్ క్లాస్ సబ్ మెరైన్లను ముంబైలో డీసీఎన్ఎస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సబ్ మెరైన్ తయారు కాగా దానికి 'కల్వరీ' అని పేరు పెట్టిన భారత ప్రభుత్వం, ప్రస్తుతం దాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. మిగతా జలాంతర్గాములు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News