: యశోద ఐసీయూలో నట్టి కుమార్!... సి.కల్యాణ్ ఆరోపణలతోనే అస్వస్థతకు గురయ్యారట!
గ్యాంగ్ స్టర్ నయీమ్ తో టాలీవుడ్ కు సంబంధాలున్నాయంటూ సంచలన ఆరోపణలు చేసిన నిర్మాత నట్టి కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సికింద్రాబాదులోని యశోద ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో నిన్న ఆయన అడ్మిట్ అయ్యారు. నయీమ్ తో నిర్మాత సి.కల్యాణ్ కు సంబంధాలున్నాయంటూ నట్టి కుమార్ చేసిన ఆరోపణలు టాలీవుడ్ లో పెను కలకలమే రేపాయి. ఈ క్రమంలో గత వారం మీడియా ముందుకు వచ్చిన సి.కల్యాణ్... నట్టి కుమార్ పై వ్యక్తిగత ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా చెప్పు తెగుద్ది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెనువెంటనే మరోమారు మీడియా ముందుకు వచ్చిన నట్టికుమార్ కూడా అదే స్థాయిలో సి.కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన తమ తండ్రి అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించామని నట్టికుమార్ పిల్లలు కరుణ, క్రాంతి తెలిపారు. అంతేకాకుండా తమ తండ్రిపై సి.కల్యాణ్ వ్యక్తిగత ఆరోపణలు గుప్పిస్తున్నారని, తమ తండ్రికి ఏమైనా జరిగితే సి.కల్యాణే బాధ్యత వహించాలని వారు పేర్కొన్నారు.