: ఒక్క టాయిలెట్ కోసం 76 మంది బాలురు, 66 మంది అమ్మాయిల క్యూ.. ఇదీ ప్రభుత్వ స్కూళ్ల తీరు
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల దయనీయ పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాలపై ప్రభుత్వం ఇస్తున్న హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న సంగతి తాజా సర్వేలో వెల్లడైంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లోని 450 ప్రభుత్వ స్కూళ్లలో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ 'వాటర్ ఎయిడ్' నిర్వహించిన సర్వే విస్తుపోయే నిజాలను వెల్లడించింది. సర్కారు స్కూళ్లలో సగటున ఒక్క టాయిలెట్‌ను 76 మంది బాలురు వాడుకుంటుండగా, 66 మంది విద్యార్థినులు ఉపయోగిస్తున్నట్టు తేల్చింది. రెండు సంవత్సరాల క్రితం కేంద్రం స్వచ్ఛ విద్యాలయ అభియాన్ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలల్లో బాలబాలికలకు ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం ఈ కార్యక్రమం ఉద్దేశం. 2.61 లక్షల పాఠశాలల్లో 4.17 లక్షల టాయిలెట్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ఆగస్టు 2015లో ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. స్వచ్ఛ విద్యాలయ అభియాన్ ప్రకారం 40 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ ఉండాలి. కానీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా విద్యార్థుల అవస్థలకు మాత్రం మోక్షం కలగలేదని తాజా సర్వే చెబుతోంది. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 4,800 మంది విద్యార్థులు, 800 మంది ఉపాధ్యాయులను ఇంటర్వ్యూ చేశారు. దాదాపు 95 శాతం స్కూళ్లలో బాలబాలికలకు ఒకే టాయిలెట్ అందుబాటులో ఉండగా 76 శాతం పాఠశాలల్లో వేర్వేరు టాయిలెట్లు ఉన్నాయి. ఈ విషయంలో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది.