: గొడవలకు వెళ్లే వారెవరైనా సరే నా అభిమానులుగా ఉండొద్దు: జూనియర్ ఎన్టీఆర్
మితిమీరిన అభిమానం ఎప్పుడూ మంచిది కాదని తన వ్యక్తిగత అభిప్రాయమని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘వేటి వల్ల అభిమానం మితిమీరుతుందో కూడా చెబుతాను. ముందుగా.. నువ్వు పుట్టిన దేశాన్ని ప్రేమించు... నిన్ను కన్న తల్లిదండ్రులను ప్రేమించు.. నీ మీద నమ్మకం పెట్టుకున్న నీ భార్యను ప్రేమించు.. నిన్నే నమ్ముకుని పుట్టిన నీ పిల్లలను ప్రేమించు. ఆ తర్వాత నీ అభిమానులనేవారిని ప్రేమించు. క్రాస్ రోడ్స్ లో నిలబడాల్సివస్తే కనుక.. దేశం, తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, నిన్ను ప్రేమించిన శ్రేయోభిలాషుల వైపు వెళ్లిన తర్వాత, చివర్లో నీ అభిమాన నటులు వైపు వెళ్లాలి. ఈ విషయాన్ని కేవలం నా అభిమానులకే కాదు, అందరి అభిమానులకు చెబుతున్నాను. అభిమానమనేది సినిమాల వరకే. రెండు గంటలు చూసే సినిమా కోసం గొడవలకు దిగొద్దని నేను అందరినీ కోరుకుంటున్నాను. నా అభిమానులు గొడవల వైపు వెళ్లరనే నమ్మకం కచ్చితంగా నాకు ఉంది. బట్, గొడవలకు వెళ్లేటట్లయితే.. దయచేసి నా అభిమానులుగా ఉండొద్దని కోరుకుంటున్నాను’ అని జూ.ఎన్టీఆర్ అన్నారు.