: ‘సీమ’ పర్యటనలో ఏపీ సీఎం!... తొలుత అనంతపురం, తర్వాత చిత్తూరు జిల్లాలో పంటల పరిశీలన!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి ఉదయం రాయలసీమ పర్యటనకు బయలుదేరారు. విజయవాడ నుంచి నేటి ఉదయం బయలుదేరిన ఆయన కాసేపటి క్రితం అనంతపురం జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. జిల్లాలో వర్షాభావం కారణంగా ఎండుదశకు చేరుకున్న వేరుశనగ పంటను ఆయన పరిశీలించనున్నారు. నీరు లేక వాడిపోతున్న సదరు పంటలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతపురం జిల్లా పర్యటనను ముగించుకున్న తర్వాత అక్కడి నుంచే ఆయన తన సొంత జిల్లా చిత్తూరు పర్యటనకు వెళతారు. చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలంలోని పంటల పరిస్థితిని కూడా ఆయన పరిశీలిస్తారు.