: పెళ్లికి సిద్ధపడ్డ సాక్షి మాలిక్!... వరుడు కూడా రెజ్లరేనట!
రియో ఒలింపిక్స్ లో కాకలు తీరిన క్రీడాకారులంతా ఒట్టి చేతులతో వెనక్కొస్తుండగా... ఇక ఈ దఫా మనకు ఒలింపిక్స్ లేదని భారతీయులంతా నిరాశలో కూరుకుపోయిన తరుణంలో సత్తా చాటి భారత పతకాల ఖాతా తెరచిన స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ నిన్న మరో సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాదిలోనే తాను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె ప్రకటించింది. వెరసి పతకం తెచ్చి భారతీయులను సంతోషంలో ముంచేసిన ఆమె పెళ్లి మాట చెప్పి మరింత సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. సహచర రెజ్లర్ నే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పిన సాక్షి... అతడి పేరు మాత్రం ఇప్పుడే వెల్లడించలేనని పేర్కొంది. పెళ్లితో తన కెరీర్ కు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పిన ఆమె... టోక్యోలో పతకం దిశగానే ముందుకు సాగుతానని ప్రకటించింది.