: తొలి టీ20లో భారత ఒక్క పరుగు తేడాతో ఓటమి.. ఉసూరుమనిపించిన ధోనీ!
అమెరికాలోని ఫ్లోరిడాలో శనివారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. చివరి బంతికి విజయానికి రెండు పరుగులు కావాల్సిన దశలో కెప్టెన్ ధోనీ అవుటయ్యాడు. భారత్ ఓటమితో సిరీస్‌లో 1-0తో విండీస్ ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు వేగవంతమైన పరుగులతో స్టేడియాన్ని హోరెత్తించింది. బ్యాట్స్‌మెన్ వీరవిజృంభణతో పరుగులు వెల్లువెత్తాయి. బంతి కనిపించడమే పాపమన్నట్టు ఎవిన్ లెవిస్ రెచ్చిపోయాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో శతకం బాది టీమిండియా బౌలర్లకు హెచ్చరికలు పంపాడు. జాన్సన్ చార్లెస్ 33 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. వీరిద్దరూ చెలరేగిపోవడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒక దశలో స్కోరు 300 దాటుతుందనుకుంటున్న సమయంలో బౌలర్లు కట్టడి చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, జడేజా రెండేసి వికెట్లు నేలకూల్చారు. తర్వాత 246 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రహానే(7), విరాట్ కోహ్లీ(16) ఘోరంగా విఫలమయ్యారు. 51 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రోహిత్ ఆదుకున్నాడు. పొలార్డ్ బౌలింగ్‌లో రోహిత్(62) వెనుదిరిగిన తర్వాత కేఎల్ రాహుల్ బ్యాట్ ఝళిపించాడు. చివరి ఏడు ఓవర్లలో 96 పరుగులు చేయాల్సిన దశలో వేగం పెంచాడు. వరుసగా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో బ్రావో బౌలింగ్‌లో ధోని(43) అవుట్ కావడంతో భారత్ ఇన్సింగ్స్ ముగిసింది. ఒకే ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలై సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడిపోయింది. కాగా ఎప్పటిలాగే విన్నింగ్ షాట్ కొట్టి జట్టును విజయ తీరాలకు చేరుస్తాడని భావించిన అభిమానులు కెప్టెన్ ఆటతీరుతో నిరాశ చెందారు. అగ్రరాజ్యంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గత రికార్డులు కొన్ని బద్దలయ్యాయి. టీమిండియా బ్యాట్స్‌మెన్ రాహుల్ టీ20ల్లో వేగంగా సెంచరీ (46 బంతుల్లో) చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు.అంతకుముందు రిచర్డ్ లెవీ 45 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. అంతేకాదు టీ20ల్లో సురేష్ రైనా, రోహిత్ శర్మ తర్వాత సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ రికార్డులకెక్కాడు. టీ20 చరిత్రలో 489 పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 469 పరుగులు నమోదయ్యాయి.