: గోవుల్నే కాపాడాలనుకుంటే ప్రతి బీజేపీ కార్యకర్త ఒక ఆవును కొని మేపండి: పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
బీజేపీ ముందు ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం గురించి ఆలోచించాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రధాన సమస్యలకు పరిష్కారాలు వెతకడం మానేసి గోరక్షణ, గోసంపద, గోమాంసం అంటూ గోవుల ఉద్ధరణకు పూనుకుంటున్నారని, అది మంచిదేనని, తన వద్ద కూడా 15 గోవులున్నాయని ఆయన చెప్పారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతలు ఆవు మాంసం మీద పడిపోయి, మిగిలిన సమస్యలన్నింటినీ పక్కనపెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. గోవుల గోలపెట్టి ఏపీకి ప్రత్యేకహోదా, తెలంగాణ హైకోర్టు వంటి సమస్యలను పరిష్కరించడం మానేసి, సమస్యలన్నింటినీ గోవులు, కులాలు అంటూ డైవర్ట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. అలా కాకుండా బీజేపీ ప్రభుత్వానికి చెందిన నేతలు గో సంరక్షణ కోసం పాటు పడాలంటే...భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీలకు చెందిన ప్రతికార్యకర్త ఒక్కో గోవును కొనుగోలు చేసి, వాటిని, వాటి సంతతిని పెంచుకోమని చెప్పండని ఆయన తెలిపారు. ఇంకా గో సంరక్షణ కోసం చేపట్టిన చర్యలు సరిపోక పోతే కొత్తగా కార్పోరేట్ గో సంరక్షణ చట్టం పేరుతో ఓ చట్టం చేసి, కార్పొరేట్ చేయండి... అంతే కానీ సమస్యలను మాత్రం పక్కదోవపట్టించకండి" అని ఆయన సూటిగా చెప్పారు.