: ప్రేమలో పడిందన్న కోపంతో కన్న కూతురి తల నరకాలని సుపారీ ఇచ్చిన తల్లిదండ్రులు!
తమ కుమార్తె ప్రేమలో పడిందన్న ఆగ్రహంతో ఆమెను హత్య చేయాలని స్వయంగా తల్లిదండ్రులే రౌడీలకు సుపారీ ఇచ్చిన ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తిరుచ్చిలోని కృష్ణా నగర్ కు చెందిన రజపున్నీసా బేగం (20), అక్కడికి సమీపంలోనే ఉండే హాసన్ (23)లు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. విషయం రజపున్నీసా ఇంట్లో తెలియడంతో ఆమెను ఇంట్లో బంధించారు. అంతేకాదు, తమ మాట వినడం లేదన్న కోపంతో వడివేలు అనే కిరాయి గూండాను నియమించి తమ కుమార్తెతో పాటు హాసన్ తలలు నరికి వేయాలని చెప్పారు. ఇందుకు డబ్బు కూడా ఇచ్చారు. ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డ ఈ జంట, పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంది. వీరిద్దరూ కమిషనర్ వద్ద ఉన్నారని తెలుసుకున్న ఇరువురి బంధువులూ అక్కడ చేరడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని, ఈ ప్రేమజంట ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.