: మేము పెళ్లి చేస్తే మీరు బాజాలు కొట్టడం కాదు.. తెలంగాణకి జాతీయ ప్రాజెక్టులు తీసుకురండి: రాష్ట్ర బీజేపీకి టీఆర్ఎస్ ఎంపీ కవిత చురక
'మేము పెళ్లి చేస్తే మీరు బాజాలు కొట్టడం కాదు.. తెలంగాణకి జాతీయ ప్రాజెక్టులు తీసుకురండి' అని నిజామాబాద్ ఎంపీ కవిత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటే బీజేపీ రాష్ట్ర నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కి ధన్యవాదాలంటూ పోస్టర్లు పెట్టుకున్నారని ఆమె అన్నారు. రాష్ట్రప్రజలపై బీజేపీ నేతలకు ప్రేముంటే వారి అధిష్ఠానంతో మాట్లాడి తెలంగాణకి ఒక జాతీయ ప్రాజెక్టుని తీసుకురావాలని ఆమె సవాలు విసిరారు. టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలంగాణ పొందుతున్న ప్రయోజనాలను మరచి అనవసర విమర్శలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి విమర్శలు చేసిన తరువాత టీడీపీ మరో నేత రమణ కూడా తెలంగాణ మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంపై పలురకాల విమర్శలు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సాధించింది ఏమీ లేదని ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రతిపక్షాలంతా కలిసి తుమ్మిడిహట్టి దగ్గర 148 మీటర్ల ఎత్తుకే కేసీఆర్ సంతకం పెట్టారని విమర్శలు గుప్పిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో లోయర్ పెన్ గంగా ప్రాజెక్టును గురించి పట్టించుకోని నేతలు తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు తాము చేసుకున్న ఒప్పందంపై మండిపడడం ఏంటని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆదిలాబాద్ వాసులకు సరిగ్గా నీళ్లు అందని పరిస్థితి ఉందని కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న మూడు ప్రాజెక్టులతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌రెడ్డి మొత్తం ప్రాజెక్టులను రాష్ట్ర ఖర్చు తోనే కడుతున్నామని, మహారాష్ట్రకు అనవసరంగా నిధులు ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. దానిలో వాస్తవం లేదని పేర్కొన్నారు. పక్కవాళ్లు కూడా బాగుపడాలనేదే సీఎం కేసీఆర్ పాలసీ అని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర బాగుండాలనే కేసీఆర్ కోరుకుంటారని కవిత వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎటువంటి వ్యక్తో ప్రజలకి తెలుసని అన్నారు.