: అమెరికాకు షాక్ ఇచ్చిన బీజేపీ ఎంపీ... అగ్రరాజ్యం ఆహ్వానాన్ని చెత్తబుట్టలో పడేసిన వైనం!
తనిఖీల పేరుతో అందర్నీ ఇబ్బంది పెట్టే అగ్రరాజ్యం అమెరికాకు బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్ షాకిచ్చారు. అమెరికాలో జరగనున్న రైతు సదస్సులో పాల్గొనేందుకు రావాలంటూ అమెరికా ఆయనకు ఆహ్వానం పంపించింది. ఇందులో భాగంగా వీసా కోసం తమ ఎంబసీకి రావాలని ఆయనకు సమాచారం పంపించింది. దీంతో ఆయన ఢిల్లీలోని యూఎస్ ఎంబసీకి వెళ్లారు. అక్కడ వీసా అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత ఫోటోలు అతికించాలని అన్నారు. దానికి తన వద్ద ఉన్న ఫోటోలు ఇవ్వగా, ఆ ఫోటోలను అమెరికా అంగీకరించదని, తలపైనున్న తలపాగా తీసేసి ఉన్న ఫొటోలు ఉంటే ఇవ్వాలని, లేని పక్షంలో ఆయన తలపాగా తీసి పోజిస్తే ఫోటో తీసుకుంటామని అమెరికా ఎంబసీ అధికారులు ఆయనకు సూచించారు. సంప్రదాయంగా వస్తున్న తలపాగాను తీసేయమనడాన్ని ఆయన అవమానంగా భావించారు. తానిలాగే ఉంటానని, అమెరికా ఆహ్వానానికి ఇలాగే వస్తానని, తలపాగా తీసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారులు అలా కుదరదని చెప్పడంతో మండిపడ్డ ఆయన, తనను ఆహ్వానించింది అమెరికాయే అని గుర్తు చేసి, తనకు అమెరికా వీసా అక్కర్లేదని చెప్పి, అమెరికా ఆహ్వానాన్ని అక్కడే వున్న చెత్త బుట్టలో పడేసి, ఎంబసీ నుంచి బయటకు వచ్చేశారు. దీనిని పార్లమెంట్ లో లేవనెత్తుతానని వీరేంద్ర సింగ్ హెచ్చరించారు. దీంతో ఆత్మగౌరవం కోసం ఎంపీ తీసుకున్న నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు. అమెరికాకు తగిన బుద్ధి చెప్పారని ఆయనను అంతా ప్రశంసిస్తున్నారు.