: ‘తలాక్’ విధానంపై వివరణ ఇవ్వండి: కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు
ముస్లిం సంప్రదాయంలో విడాకుల నిమిత్తం మూడు సార్లు తలాక్ చెప్పే విధానం గురించి వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోల్ కతాకు చెందిన 26 సంవత్సరాల ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై వివరణ కోరుతూ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నోటీసులు పంపించింది. కాగా, తన భర్త దుబాయ్ నుంచి ఫోన్ చేసి మూడు సార్లు తలాక్ చెప్పి తనకు విడాకులు ఇచ్చేశాడని, దీనిని తాను వ్యతిరేకిస్తున్నానని కోల్ కతాకు చెందిన మహిళ ఆ ఫిర్యాదులో పేర్కొంది. 'తలాక్’ విధానం రాజ్యాంగబద్ధం కాదని, తన భర్త, వారి కుటుంబసభ్యులు తనను వేధిస్తున్నారని, తన నలుగురు పిల్లలను తన వద్ద నుంచి బలవంతంగా లాక్కుపోయారని ఆ మహిళ తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది. ‘తలాక్’ను వ్యతిరేకిస్తూ మరికొన్ని పిటిషన్లు కూడా న్యాయస్థానంలో దాఖలయ్యాయి. ఈ కేసుపై తదుపరి విచారణను సెప్టెంబరు 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.