: టూత్ పేస్టు, బిస్కెట్స్, నూడిల్స్... ఇప్పుడిక పూజా ద్రవ్యాల మార్కెట్లోకి బాబా రాందేవ్


ఇప్పటికే టూత్ పేస్టు, బిస్కెట్స్, నూడిల్స్ మార్కెట్లలోకి ప్రవేశించి దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీల మార్కెట్ వాటాకు గండికొట్టిన యోగా గురు బాబా రాందేవ్ సంస్థ పతంజలి, తాజాగా పూజా ద్రవ్యాల మార్కెట్లోకి ప్రవేశించాలని నిర్ణయించింది. 'పతంజలి అస్థ' బ్రాండ్ పేరిట దాదాపు రూ. 8,000 కోట్లకు విస్తరించిన పూజా ద్రవ్యాల మార్కెట్లోకి ఒకేసారి 100 రకాల ప్రొడక్టులతో దూసుకెళ్లాలన్నది రాందేవ్ యోచనగా తెలుస్తోంది. ఈ రంగం శరవేగంగా విస్తరిస్తుండటం, పూజా ద్రవ్యాల మార్కెట్లో ఆన్ లైన్ దిగ్గజం అమేజాన్ రెండంకెల వృద్ధిని సాధించడంతో, అగర్ బత్తీ, ధూప్, సాంబ్రాణి, వివిధ రకాల దీపపు సెమ్మెలు తదితరాలను వచ్చే రెండు నెలల్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. "మేము ఓ కొత్త బ్రాండును పరిచయం చేయనున్నాం. ఇప్పటివరకూ భక్తులు పూజలు చేసే వేళ, వివిధ రకాల రసాయనాలు కలగలిసిన అగరు బత్తీలు, ధప్ స్టిక్స్ వాడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి హాని కలిగించేవే. మేము సహజసిద్ధంగా తయారైన ప్రొడక్టులను 'అస్థ' పేరిట అందిస్తాం" అని పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు. దీపావళి పర్వదినానికి ముందే తమ ప్రొడక్టులు మార్కెట్లో ఉంటాయని, ఇప్పటికే 1,500 మంది డీలర్లను సిద్ధం చేశామని, దేశవ్యాప్తంగా 3 లక్షల స్టోర్లలో ఒకేసారి ఇవి అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News