: రంగంలోకి దిగిన సీవీ ఆనంద్!... మిల్లర్ల బియ్యం బకాయిల తక్షణ వసూలుకు ఆదేశాలు!
తెలంగాణలో ఐఏఎస్ అధికారులకు చెందిన కీలక పోస్టుల్లో ఐపీఎస్ అధికారులు నియమితులవుతున్నారు. ఇప్పటికే గురుకుల పాఠశాలల వ్యవహారాలను సీనియర్ ఐపీఎస్ అదికారి ప్రవీణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. తాజాగా హైదరాబాదు పోలీసు శాఖలో సుదీర్ఘ కాలంగా వివిధ పోస్టుల్లో పనిచేసి సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న సీవీ ఆనంద్ ను ప్రభుత్వం ఇటీవలే పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా నియమించింది. ఆ బాధ్యతలు స్వీకరించిన ఆనంద్ వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అందజేయాల్సిన బియ్యంపై ఆయన దృష్టి సారించారు. నిర్దేశిత గడువు ముగుస్తున్నా బియ్యాన్ని ప్రభుత్వానికి అందించడానికి మిల్లర్లు ససేమిరా అంటున్నారని ఆయన తెలుసుకున్నారు. ఈ క్రమంలో అసలు జరుగుతున్న తంతు ఏమిటని ఆనంద్ ఆరా తీశారు. ప్రభుత్వానికి బియ్యాన్ని అందించాల్సిన మిల్లర్లు... అందుకు విరుద్ధంగా సదరు బియ్యాన్ని బహిరంగ మార్కెట్ లో విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారని తేల్చారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చేదాకా మిల్లర్లు బియ్యం అందజేతపై దృష్టి సారించడం లేదని కూడా ఆయన తెలుసుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీవీ ఆనంద్... తక్షణమే మిల్లర్ల నుంచి బియ్యం బకాయిలపై దృష్టి సారించాలని ఆయన జిల్లాల జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.