: నట్టి కుమార్ ను పిచ్చికుక్కతో పోల్చిన సి.కల్యాణ్!... నయీమ్ తో లింకులు లేవని ప్రకటన!
గ్యాంగ్ స్టర్ నయీమ్ తో టాలీవుడ్ కు లింకులున్నాయని సంచలన ఆరోపణలు చేసిన నిర్మాత నట్టి కుమార్ ఆరోపణలపై టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఘాటుగా స్పందించారు. కాసేపటి క్రితం హైదరాబాదులోని ఫిల్మ్ చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా నట్టి కుమార్ పై కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నట్టి కుమార్ తో పాటు ఆయన కుటుంబసభ్యులను పిచ్చికుక్కలతో పోల్చిన కల్యాణ్... నట్టి కుమార్ వ్యవహారాలను ఏకరువు పెట్టారు. నయీమ్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలు నిజమని తేలితే ఎంతటి పెద్దవాళ్లనైనా అరెస్ట్ చేయవచ్చని ఆయన పోలీసులకు సూచించారు. తనతో పాటు పలువురు నిర్మాతలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులను నట్టి కుమార్ నిలువునా మోసం చేశాడని ఆయన ఆరోపించారు. నట్టి కుమార్ మాదిరే అతడి కొడుకు కూడా తనను మోసగించాడని కల్యాణ్ ధ్వజమెత్తారు. నట్టి కుమార్ ను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని కోరారు. నట్టి కుమార్ బాధితుల కోసం ఓ సెల్ ను తెరవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. నయీమ్ కేసులో నట్టి కుమార్ వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టాలని ఆయన కోరారు.