: తీహార్ జైల్లో కలకలం!... నిర్భయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం!
ఢిల్లీలోని తీహార్ జైల్లో నేటి ఉదయం పెను కలకలం రేగింది. యావత్తు దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటనలో దోషిగా తేలిన వినయ్ శర్మ జైల్లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత జైల్లోనే అతడు నిద్ర మాత్రలు మింగడంతో పాటు ఉరేసుకుని తనువు చాలించేందుకు యత్నించాడు. అయితే సకాలంలో స్పందించిన జైలు సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అప్పటికే ప్రాణాపాయ స్థితికి చేరుకున్న అతడిని జైలు సిబ్బంది హుటాహుటిన దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. 2012లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటనలో వినయ్ శర్మ సహా దోషులందరికీ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, వీరు సుప్రీంకోర్టుకు అపీల్ చేసుకోవడంతో కేసు ప్రస్తుతం అక్కడ విచారణలో వుంది. కాగా, ఈ కేసులో తనపై జైలులోనే భౌతిక దాడులు జరుగుతున్నాయని చెప్పిన వినయ్ శర్మ అదనపు భద్రతను కోరాడు. అయితే ఉన్నట్టుండి అతడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఈ కేసులో మరో దోషి రామ్ సింగ్ కేసు విచారణలో ఉండగానే 2013లో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వినయ్ శర్మ కూడా ఆత్మహత్యాయత్నం చేేయడం కలకలం రేపుతోంది.