: చంద్రబాబుకి ప్యాకేజీలపై మోజు...దాని వల్ల వచ్చే లాభాలు ఆయనకే బాగా తెలుసు: కేవీపీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ప్యాకేజీపై ఉన్న మోజు ప్రత్యేకహోదాపై లేదని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ద్వారా వచ్చే లాభాల కంటే ప్యాకేజీ వల్ల వచ్చే లాభాల గురించి బాబుకే బాగా తెలుసని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు పూర్తి చేసి, కేంద్రానికి అప్పగిస్తే ఆ ప్రాజెక్టు ఈపాటికే పూర్తయి ఉండేదని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడో అంతుచిక్కడం లేదని ఆయన అన్నారు. పోనీ చంద్రబాబు చేతకానివాడు, తెలివిలేని వాడు, అధైర్యవంతుడు అనుకుందామంటే కాదని ఆయన చెప్పారు. చంద్రబాబు చేవగలవాడు, తెలివిగల వాడు, ధైర్యవంతుడు అని ఆయన చెప్పారు. బాబు గతంలో రాష్ట్రపతి, ప్రధానులను కేంద్రంలో నిలబెట్టిన వ్యక్తి అని ఆయన అన్నారు. ఈ విషయం ఆయనే చాలాసార్లు చెప్పారని కేవీపీ గుర్తుచేశారు. అలాంటి చంద్రబాబు ఎందుకు ఇలా మారాడో తనకు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆయన గురించి తెలిసిన వారికి... చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడడం లేదని స్పష్టంగా తెలుస్తుందని ఆయన తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు చూపుతున్నది ఆయన నిజస్వరూపం కాదని, స్వార్థ ప్రయోజనాలన్నీ పూర్తయిన తరువాత...ప్యాకేజీ డబ్బులన్నీ స్వార్ధానికి వినియోగించుకున్న తరువాత ఎన్డీయేపై చంద్రబాబు తిరుగుబావుటా ఎగురవేస్తాడని ఆయన జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News