: ‘పోకెమాన్ గో’ ఆడుతూ వాహనాలు నడుపుతున్న 42 మంది అరెస్టు
‘పోకెమాన్ గో’ గేమ్ ఆడుతూ వాహనాలు నడుపుతున్న వారిపై థాయ్ ల్యాండ్ పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో 42 మందిని అరెస్ట్ చేశారు. వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్ వినియోగించడం, ‘పోకేమాన్ గో’ గేమ్ ఆడటం థాయ్ ల్యాండ్ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం. ఈ నేపథ్యంలోనే వారిని అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగిన సందర్భంలో ‘పోకేమాన్ గో’ ఆడుతూ తమ కంట పడిన వారిని అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు తీసేసుకున్నామని, ఈ గేమ్ ఆడుతూ దొరికిన వారికి జరిమానా విధిస్తామని అన్నారు. ‘పోకేమాన్ గో’ ఆడుతూ వాహనాలు నడపటం వల్ల సంభవిస్తున్న ప్రమాదాలను నివారించే నిమిత్తం బ్యాంకాక్ లోని 10 ప్రధాన రోడ్లపై ప్రచారం చేపట్టామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.