: రాజధాని నిర్మాణంలో జరుగుతున్న వ్యవహారాలను పరిశీలించడానికి అన్నాహజారేను పిలిపించాలి: వైసీపీ నేత భూమన
వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో వరుసగా మూడోసారి కరవు వచ్చిందని, అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరవు నివారణ చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు. రాజధాని పేరుతో అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో జరుగుతున్న వ్యవహారాలను పరిశీలించడానికి ప్రజా ఉద్యమకారుడు అన్నాహజారేను పిలిపించాలని కోరుతున్నట్లు కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల పట్ల టీడీపీ నేతల తీరు బాగోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో రాకాసి పాలన కొనసాగుతోందని అన్నారు. 12 రోజులు పుష్కరాలలోనే చంద్రబాబు గడిపేశారని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. చంద్రబాబు శాసనసభలోనూ తమ పార్టీ నేతల గొంతు నొక్కేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై తమను మాట్లాడనివ్వకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు.