: లేడీస్ కంపార్ట్ మెంటులో జెంట్స్!... ఉతికి ఆరేసి పోలీసులకు పట్టించిన ఢిల్లీ లేడీస్!
రైళ్లలో మహిళలకు కేటాయించిన బోగీల్లో పురుషులకు ఎంట్రీ నిషిద్ధం. అయితే ఉద్దేశపూర్వకంగానో, పొరపాటుగానో సదరు కంపార్ట్ మెంట్లలోకి పురుషులు ప్రవేశిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో కొన్నిసార్లు ఎలాంటి ఇబ్బంది లేకుండానే వారు బయటపడుతున్నా... సదరు బోగీల్లోని మహిళలు ఆగ్రహిస్తే మాత్రం పరిస్థితి వేరేగా ఉంటుంది. అలాంటి అరుదైన ఘటనే ఒకటి ఢిల్లీ మెట్రో రైల్లో చోటుచేసుకుంది. ఢిల్లీ మెట్రోకు చెందిన ఓ రైల్లోని మహిళా కంపార్ట్ మెంటులోకి ఒకరు కాదు, ఇద్దరు కాదు... పది మందికి పైగా పురుషులు ఎక్కేశారు. దీంతో తొలుత షాక్ తిన్న అందులోని యువతులు ఆ తర్వాత అంతా ఏకమైపోయారు. తమ బోగీలోకి ఎక్కిన మగాళ్లను కుళ్లబొడిచారు. అంతేకాకుండా మగాళ్లందరిని కదలకుండా నిర్బంధించేసి పోలీసులకు సమాచారం అందించారు. సదరు రైలు తర్వాతి స్టేషన్ లో ఆగే సమయానికి ఓ మహిళా పోలీసు అధికారి నేతృత్వంలో అక్కడ లాఠీలతో పోలీసులంతా సిద్ధంగా ఉన్నారు. ఇంకేముంది, తలుపు తెరచుకోగానే లేడీస్ కంపార్ట్ మెంటులోని పురుషులనంతా కొడుతూ కిందకు దించేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కిందకు దిగేందుకు ససేమిరా అన్న ఓ పురుషుడిని పోలీసులు ఈడ్చి కిందకు దించేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో జాతీయ మీడియాలో వైరల్ గా ప్రసారమవుతోంది.