: ఈ అద్భుతాలు సాధించడానికి మా అమ్మ సలహాయే ప్రేరణ : పుల్లెల గోపీచంద్
పోటీల్లో పాల్గొనబోయే ముందు తమ క్రీడాకారులతో జాతీయగీతం పాడించాలని చెప్పిన తన తల్లి సుబ్బరావమ్మ సలహాతోనే అద్భుతాలు సాధించామని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఒక ఆంగ్ల పత్రికతో ఆయన మాట్లాడుతూ, తన తల్లి చేసిన ఈ సలహా తనకు, తన వద్ద శిక్షణ తీసుకున్న క్రీడాకారులకు ఎంతో ప్రేరణ నిచ్చిందని చెప్పారు. రియో ఒలింపిక్స్, అంతకుముందు జరిగిన ఒలింపిక్స్ లో తమ క్రీడాకారులు విజయం సాధించడానికి ఇదే కారణమని అన్నారు. అంతేకాకుండా, రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు, శ్రీకాంత్ లు కోర్టులో వ్యవహరించిన తీరు, ప్రేరణ పొందిన విధానానికి గల రహస్యాలేమిటని తనను చాలా మంది ప్రశ్నించారని చెప్పారు. దీనికి తన తల్లి సలహాను పాటించడం ఒక కారణం కాగా, మరో కారణం.. తమ క్రీడాకారులకు తాను చెప్పిన విషయాలన్నారు. మన దేశంలో ఎంతో మంది ధనికులు, పరపతి ఉన్న వారు ఎందరో ఉన్నారని, కానీ, జాతి గౌరవాన్ని నిలబెట్టే, కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసే అవకాశం మాత్రం ఒక్క మనలాంటి క్రీడాకారులకు మాత్రమే ఉంటుందని, పతకాలు సాధించి మన దేశ గౌరవాన్ని మరింత పెంచుదామని క్రీడాకారులకు చెబుతుండేవాడినని గోపీచంద్ పేర్కొన్నారు.