: ఇప్పటివరకు రైల్వే మంత్రులు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కనీసం 40 ఏళ్లు పడుతుంది: వెంకయ్య
నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గం భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కల అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నంద్యాల-ఎర్రగుంట్ల మధ్య నూతన రైల్వే మార్గాన్ని విజయవాడ నుంచి రిమోట్ ద్వారా ఈరోజు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఈ రైలు మార్గం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన్పటి నుంచి ఇప్పటివరకు రైల్వే మంత్రులు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కనీసం 40 ఏళ్లు పడుతుందని, అంతగా హామీలు గుప్పించారని ఆయన చమత్కరించారు. ఇక కొత్త హామీలు ఇవ్వొద్దని ప్రధాని నరేంద్ర మోదీ రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభుకి సూచించారని వెంకయ్య పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటేనని అది అభివృద్ధి మాత్రమేనని ఆయన అన్నారు. కొందరు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ చర్యలను ఆపేయాలని ఆయన కోరారు.