: ర్యాంకింగ్స్ కోసం మేం ఆడటం లేదు: నెం.1 ర్యాంకును కోల్పోయిన అంశంపై విరాట్ కోహ్లీ
భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన నాలుగో టెస్టుకి వరుణుడు అడ్డుతగలడంతో మ్యాచు రద్దయిన విషయం తెలిసిందే. దీంతో టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. తమ వెస్టిండీస్ పర్యటన సంతృప్తినిచ్చిందని అన్నాడు. చివరి టెస్టు మ్యాచు డ్రా అయినా వెస్టిండీస్‌లో వచ్చిన ఫలితం ఎంతో సంతోషాన్ని నింపిందని వ్యాఖ్యానించాడు. వెస్టిండీస్ లో తమ జట్టు బలాన్ని పరీక్షించుకున్నామని కోహ్లీ అన్నాడు. స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహాలు బ్యాటింగ్లో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. టీమిండియాకు ఇది సానుకూలాంశంగా ఆయన పేర్కొన్నాడు. లోయర్ ఆర్డర్లో వచ్చి నిలదొక్కుకోవాలంటే ఎంతో కష్టమని చెప్పిన కోహ్లీ.. సాహా, అశ్విన్లు బ్యాటింగ్‌లో ఆ స్థానంలోనే వచ్చి చక్కగా రాణించారని ప్రశంసించాడు. సెంచరీలతో వీరిరువురూ భారత్‌ను ఆదుకున్నారని కోహ్లీ అన్నాడు. టెస్టు మ్యాచుల్లో నిలకడగా ఆడడం ముఖ్యమని ఆయన చెప్పాడు. టీమిండియాలో అది పూర్తిగా కనబడిందని హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు విండీస్ జట్టు కూడా చాలా బాగా ఆడిందని పేర్కొన్నాడు. చివరి టెస్టు డ్రాగా ముగియడంతో టీమిండియా తన నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయిన విషయంపై స్పందించిన కోహ్లీ తమ జట్టు ర్యాంకింగ్స్ కోసం ఆడటం లేదని వ్యాఖ్యానించాడు.