: పాకిస్థాన్‌ను పొగుడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి రమ్యపై దేశద్రోహం కేసు
కన్నడ సినీనటి, మాజీ ఎంపీ రమ్యపై తాజాగా దేశద్రోహం కేసు నమోదయింది. కన్నడ సినిమాలు సహా పలు భాషల్లో నటించిన ఆమె 2011లో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. ఇటీవలే ఆమె తన పాకిస్థాన్ పర్యటన ముగించుకొని ఇండియాకు చేరుకున్న సమయంలో పాకిస్థాన్‌ను పొగుడుతున్నట్లు మాట్లాడారు. ఈ అంశంపైనే ఆమెపై విమర్శలు వచ్చాయి. దీంతో తాజాగా ఆమెపై కర్ణాటకలోని మదికేరీలో కత్నమణె విట్టల్ గౌడ అనే న్యాయవాది దేశ ద్రోహం కేసు పెట్టారు. వచ్చే శనివారం కోర్టు ఈ కేసులో వాదనలు విననుంది. ఇస్లామాబాద్‌లో కొన్ని రోజుల క్రితం సార్క్ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సదస్సులో పాల్గొన్న రమ్య అనంతరం భారత్‌కు చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కొందరు అన్నట్లుగా పాకిస్థాన్ నరకమేమీ కాదని వ్యాఖ్యానించారు. అక్కడి ప్రజలంతా భారతీయులలాంటి వారేనని ఆమె అన్నారు. తమని పాకిస్థానీయులు చాలా బాగా చూసుకున్నారని పేర్కొన్నారు. రమ్య చేసిన ఈ వ్యాఖ్యలే వివాదాస్పదంగా మారాయి. ఓవైపు భారత హోం మంత్రి రాకను నిరసిస్తూ పాక్ నిరసనలు తెలిపిన వేళ, కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పాకిస్థాన్‌ను నరకంతో పోల్చిన వేళ రమ్య ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.