: జాబితాలో లేకున్నా చింతమడక మండల కేంద్రమే!... సొంతూరి జనానికి కేసీఆర్ హామీ!
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంతూరు చింతమడక ఇక మండల కేంద్రంగా మారనుంది. మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని చింతమడక... కేసీఆర్ స్వగ్రామమన్న విషయం తెలిసిందే. ఈ ఊరిని త్వరలోనే మండల కేంద్రంగా మారుస్తానని కేసీఆర్ గతంలో తన సొంత గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే ఆ విషయాన్ని ఆయన మరచిపోయినట్లున్నారు. నిన్న వెలువడ్డ తెలంగాణలో కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిషికేషన్ లో చింతమడక ప్రస్తావనే లేదు. విషయం తెలుసుకున్న చింతమడక వాసులు ఆందోళనకు గురయ్యారు. తమ ఊరిని మండల కేంద్రంగా చేయాల్సిందేనని వారు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత అంతా కలిసి కేసీఆర్ ను కలిసేందుకు హైదరాబాదు బయలుదేరారు. తన స్వగ్రామ ప్రజలకు అపాయింట్ మెంటు ఇచ్చిన కేసీఆర్... వారి డిమాండ్ కు సానుకూలంగా స్పందించారు. ఇచ్చిన హామీ మేరకు చింతమడకను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ హామీతో ఆ ఊరి జనం తిరుగు పయనమయ్యారు.