: కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు మరణం ప్రమాదం కాదా?... తానే పక్కా ప్లాన్ వేసి చంపానంటున్న నయీమ్!


టీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి హైదరాబాదు శివారు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి మనకు తెలిసిందే. 2011, డిసెంబర్ 20న జరిగిన ఈ ప్రమాదంలో ప్రతీక్ రెడ్డి నడుపుతున్న స్కోడా కారు వేగంగా దూసుకువచ్చి ఔటర్ పై పల్టీలు కొట్టింది. డ్రైవర్ సీటులోని ప్రతీక్ రెడ్డితో పాటు అతడి ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే చనిపోగా, ఓ మిత్రుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కోమటిరెడ్డి కుటుంబం తీవ్ర వేదనలో కూరుకుపోయింది. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన విషయం మరోమారు వార్తల్లోకెక్కింది. కరుడుగట్టిన నేరగాడిగా మారిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ను తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు హతం చేశారు. ఈ క్రమంలో నయీమ్ నుంచి వేధింపులు ఎదుర్కొన్న నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన వ్యాపారి గంపా నాగేంద్ర పోలీసులను ఆశ్రయించారు. తనకు ఎదురైన వేధింపులను ఆయన పూసగుచ్చినట్లు పోలీసులకు వివరించారు. తన నుంచి రూ.5 కోట్లు వసూలు చేసేందుకు రంగంలోకి దిగి బేరసారాల తర్వాత రూ.కోటి తీసుకొనేందుకు అంగీకరించిన నయీమ్... అనుచరులను పంపి, తనను బలవంతంగా ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశారు. తనతో నేరుగా మాట్లాడిన నయీమ్... అడిగిన మేర డబ్బులు ఇవ్వకుంటే తనకున్న ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి కొడుకు మరణం ప్రమాదం కారణంగానే జరిగినా... ఆ ప్రమాదాన్ని తానే పక్కా ప్రణాళిక వేసి, ఏ ఒక్కరికి అనుమానం రాకుండా చేశానని నయీమ్ చెప్పాడని పేర్కొన్నారు. ప్రతీక్ రెడ్డిని పక్కా ప్లాన్ వేసి చంపేశానని నయీమ్ చెప్పినట్లు నాగేంద్ర పేర్కొన్న విషయం ప్రస్తుతం పెను కలకలమే రేపుతోంది.

  • Loading...

More Telugu News