: రామకృష్ణారెడ్డి... రియల్ లైఫ్ 'గబ్బర్ సింగ్'!: కుకునూరుపల్లి ఎస్సై ఆత్మహత్య మరునాడే ఆ ప్రాంతంలో ఊపందుకున్న పేకాట, నాటుసారా!


టాలీవుడ్ అగ్ర హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెండితెరపై 'గబ్బర్ సింగ్'గా ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటే... తెలంగాణలోని మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి రియల్ లైఫ్ లో గబ్బర్ సింగ్ గా వ్యవహరించారట. గత వారం సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణారెడ్డి... సినిమాలో మాదిరి కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నాటు సారా, పేకాట, బెల్టు షాపులు, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారట. ఈ మేరకు ఆయన విధినిర్వహణ తీరుపై ఆసక్తికర కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం మత్తులో తుపాకీతో కాల్చుకుని ఆయన చనిపోయారంటూ సొంత శాఖ అధికారులు చెబుతున్నా... అందుకు విరుద్ధంగా వాస్తవ పరిస్థితులున్నాయంటూ వార్తలొస్తున్నాయి. గతంలో భారత సైన్యంలో జవానుగా విధులు నిర్వర్తించిన రామకృష్ణారెడ్డి అసాంఘిక కార్యకలాపాలను ఏమాత్రం సహించేవారు కాదట. కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపారు. గ్రామాల్లో పేకాటను పారద్రోలిన రామకృష్ణారెడ్డి... నాటు సారాను నామరూపాల్లేకుండా చేశారు. ఆయన దెబ్బకు బెల్టు షాపులన్నీ మూతపడిపోయాయి. ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టారు. ఈ క్రమంలో ఆయన మరణించేదాకా ఈ కార్యకలాపాలన్నీ కుకునూరుపల్లి పరిధిలో మాయమైపోగా, ఆయన ఆత్మహత్య చేసుకున్న మరునాడే ఇసుక అక్రమ దందా జోరందుకుందట. పేకాటరాయుళ్లు మళ్లీ పేక ముక్కలు పట్టారు. అప్పటిదాకా కనిపించకుండాపోయిన బెల్టు షాపులు మళ్లీ ఓపెన్ అయిపోయాయి.

  • Loading...

More Telugu News