: హైదరాబాద్ అంతటా సింధు ఫీవర్!
రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ సిల్వర్ మెడల్ గెలిచిన పీవీ సింధు మరికాసేపట్లో హైదరాబాద్ నగరానికి రానున్న వేళ, పలు కూడళ్లలో ఆమెకు స్వాగతం పలుకుతూ హోర్డింగులు, పోస్టర్లు వెలిశాయి. ఇప్పటికే ఆమె ప్రయాణిస్తున్న విమానం హైదరాబాద్ కు బయలుదేరినట్టు సమాచారం రాగా, ఆమెకు స్వాగతం పలికేందుకు మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ సహా పలువురు ప్రముఖులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా సింధు, ఆమె కోచ్ గోపీచంద్ లు నగరంలోకి రానున్నారు. మార్గమధ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, పలు స్కూళ్ల విద్యార్థులు, అభిమానులు రహదారికి ఇరువైపులా నిలిచి సింధూపై పూల వర్షం కురిపించనున్నారు. ర్యాలీ దాదాపు రెండు గంటలకు పైగా సాగుతుందని అంచనా. ఆపై గచ్చీబౌలీ ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సింధూకు ఘన సన్మానం జరుగనుంది. సింధూ రాకకోసం ఎదురుచూస్తూ అభిమానులు శంషాబాద్ నుంచి గచ్చిబౌలీకి వెళ్లే దారిలో ఎదురుచూస్తుండగా, నగర వ్యాప్తంగా సింధు ఫీవర్ కనిపిస్తోంది.