: 'నభూతో నభవిష్యతి' అనే రీతిలో ముగిసిన ఒలింపిక్స్... 67వ స్థానంలో భారత్
రెండు వారాలకు పైగా ప్రపంచ క్రీడాభిమానులను అలరించిన రియో ఒలింపిక్స్ ముగిశాయి. యువ ఆటగాళ్ల అద్భుత విన్యాసాలు, దిగ్గజ క్రీడాకారుల పాత రికార్డులను మరిపించిన ఈ ఒలింపిక్స్ లో ఇండియా 67వ స్థానంలో నిలిచింది. ముగింపు వేడుకలు రియో డీ జనీరోలోని మరకానా స్టేడియాంలో నభూతో నభవిష్యతి అన్న చందంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను బ్రెజిల్ ప్రభుత్వం నిర్వహించింది. చివరిగా విక్టరీ సెర్మనీ జరుగగా, మెన్స్ మారథాన్ లో విజయం సాధించిన ఆటగాళ్లకు పతకాలను బహూకరించారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బక్ పతకాలను బహూకరించగా, స్వర్ణ పతకాన్ని కెన్యాకు చెందిన లూయిడ్ కిప్చోజీ అందుకున్నాడు. రజత పతకాన్ని ఇథియోపియాకు చెందిన ఫెయీసా లిలిసా, కాంస్య పతకాన్ని అమెరికాకు చెందిన గాలెన్ రూప్ అందుకున్నారు. తదుపరి 2020లో ఒలింపిక్స్ జరిగే జపాన్ రాజధాని టోక్యో ప్రతినిధులకు ఒలింపిక్స్ పతకాన్ని అందించడంతో రియో వేడుక లాంఛనంగా ముగిసింది. ఇక పతకాల గెలుపులో అమెరికా తొలి స్థానంలో నిలువగా, బ్రిటన్ రెండో స్థానంలో, చైనా మూడో స్థానంలో నిలిచాయి. భారత క్రీడాకారిణులు పీవీ సింధు బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకాన్ని, సాక్షీ మాలిక్ రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.