: రూ. 4,350 కోట్ల అప్పుల్లో డొనాల్డ్ ట్రంప్ కంపెనీలు... కలకలం సృష్టిస్తున్న 'న్యూయార్క్ టైమ్స్' కథనం


రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు చెందిన వ్యాపార సామ్రాజ్యం 650 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 4,350 కోట్లు) మేరకు అప్పుల్లో కూరుకుపోయిందని 'న్యూయార్క్ టైమ్స్' రాసిన పరిశీలనాత్మక కథనం అమెరికాలో కలకలం రేపుతోంది. తనను తాను విజయవంతమైన వ్యాపారవేత్తగా, బిలియన్ల కొద్దీ డాలర్ల సంపదన సృష్టించిన వ్యక్తిగా పరిచయం చేసుకునే ట్రంప్ కు ఈ కథనం అధ్యక్ష రేసులో పెను అడ్డంకిగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ భాగస్వామిగా ఉన్న అవెన్యూ అఫ్ అమెరికాస్ భవంతి 950 మిలియన్ డాలర్ల రుణాలను బ్యాంక్ ఆఫ్ చైనా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి చెల్లించాల్సి వుంది. ఆయన ప్రారంభించిన ఎన్నో నిర్మాణ రంగ ప్రాజెక్టులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. గతంలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడ్డ వారిలో ఎవరికీ లేనంత రుణభారం ట్రంప్ పై ఉంది. ట్రంప్ వ్యాపారమే పెద్ద మిస్టరీతో కూడుకుని ఉన్నదని వ్యాఖ్యానించిన 'న్యూయార్క్ టైమ్స్', ఆయన ఆస్తుల విలువను స్వతంత్ర పరిశీలకులచే గణించాలన్న వాదనను ట్రంప్ తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేసింది. కాగా తన రుణాలపై ట్రంప్ పూర్తి స్థాయి నివేదికను ఫెడరల్ ఫైనాన్షియల్ విభాగానికి తెలియజేయలేదన్న కొత్త వాదన వినిపిస్తోంది. ప్రచారం ప్రారంభించే ముందు ఆయన తన ఆస్తులను ప్రకటిస్తూ, 315 మి. డాలర్ల విలువైన ఆస్తి తనకున్నట్టు 104 పేజీల నివేదికలో తెలిపారు. తాను వైట్ హౌస్ భవంతిలోకి వస్తే, తన పిల్లలు వ్యాపారాన్ని నిర్వహిస్తారని చెప్పుకుంటున్న ట్రంప్ కంపెనీల అప్పులు నిజమే అయితే, ఫెడరల్ విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News