: కశ్మీర్ అల్లర్ల ఫలితం.. చమురు సరఫరాను నిలిపివేసిన ట్యాంకర్ల యజమానులు


కశ్మీర్.. నెలరోజులకు పైగా రావణకాష్టంలా రగులుతున్న రాష్ట్రం. రికార్డు స్థాయిలో కర్ఫ్యూ కొనసాగుతున్న రాష్ట్రం. ఓ వైపు అల్లరి మూకల రాళ్ల దాడులు. మరోవైపు భద్రతా దళాల మోహరింపు. ఇంకోవైపు వేర్పాటువాదుల బంద్ పిలుపు.. వెరసి జనజీవనం అస్తవ్యస్తం. బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్‌లో నెలకొన్న దుస్థితి ఇది. వ్యాపారాలు దెబ్బతిని, పనుల్లేక ప్రజలు పస్తులుంటున్నారు. అయినా కశ్మీరీ యువత ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పుస్తకాల స్థానంలో రాళ్లు చేతబట్టి దాడులకు దిగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, క్లీనర్లపై దాడులు జరుగుతుండడంతో కశ్మీర్, లఢఖ్ ప్రాంతాలకు ఆయిల్ సరఫరాను నిలిపివేయాలని ట్యాంకర్ల యజమానులు నిర్ణయించారు. డ్రైవర్లు, క్లీనర్లకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని, ఇటీవల వారిపై దాడులు పెరిగిపోయాయని జమ్ముకశ్మీర్ పెట్రోల్ ట్యాంకర్ల యజమానుల సంఘం అధ్యక్షుడు ఆనంద్ శర్మ తెలిపారు. ఆదివారం నుంచి ఆయిల్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు చెప్పారు. అనంతనాగ్ జిల్లాలోని ఖన్నబల్‌లో ఇద్దరు ట్యాంకర్ డైవర్లపై ఆందోళనకారులు దాడిచేసి వారి చేతులు విరిచేసినట్టు చెప్పారు. వారి దాడుల్లో ఇప్పటి వరకు డజనుకు పైగా ట్యాంకర్లు దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు. ట్యాంకర్ యజమానుల నిర్ణయంతో లోయలో ఆయిల్ సంక్షోభం తలెత్తే ప్రమాదముంది. కశ్మీర్‌లో నెలరోజులకు పైగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు 67 మంది మృతి చెందగా 5వేల మంది గాయపడ్డారు.

  • Loading...

More Telugu News