: ఉగ్రవాదంపై మోదీ విధానంతో ఒంటరైన పాక్.. ప్రజలు గుజరాత్‌కు రుణపడి ఉంటారన్న నఖ్వీ
ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్రమోదీ అవలంబిస్తున్న వైఖరితో ప్రపంచంలో పాకిస్థాన్ ఒంటరి అయిపోయిందని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. ‘‘ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంబించే ప్రసక్తే లేదు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తోంది. ఈ విషయాన్ని మోదీ ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు. దేశభద్రత కోసం ఆయన అవలంబిస్తున్న విధానాలు, ఉగ్రవాదంపై ఆయన వైఖరితో ఈరోజు పాక్ ప్రపంచంలోనే ఒంటరైపోయింది’’ అని నఖ్వీ వివరించారు. ఖేడా జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన నఖ్వీ మాట్లాడుతూ దేశానికి మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, నరేంద్రమోదీని అందించిన గుజరాత్‌కు దేశ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. దేశాన్ని విశ్వగురుగా మార్చిన ఘనత వారిదేనని కొనియాడారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం గుజరాత్ గురించి మాట్లాడుకునేదని, ఇప్పుడు ప్రధాని అయిన తర్వాత భారత్ గురించి మాట్లాడుకుంటోందని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తే మోదీ ఈ దేశాన్ని అవినీతి రహిత దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా తయారుచేసేందుకు కృషి చేస్తున్నారని నఖ్వీ పేర్కొన్నారు.