: ఇప్పటి వరకు సింధుకు వచ్చిన బహుమతులివే!
బ్రెజిల్ లోని రియో డీ జెనీరోలో జరిగిన ఒలింపిక్స్ లో రజత పతకంతో మెరిసి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన పూసర్ల వెంకటసింధుకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో దేశ యువతకు స్పూర్తినిచ్చిందంటూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు నజరానా ప్రకటించాయి. వాటి వివరాల్లోకి వెళ్తే... సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నగదు బహుమతి ప్రకటించింది. దానితో పాటు హైదరాబాదులో ఆమె కోచింగ్ కు అనువుగా ఉండేలా వెయ్యి గజాల ఇంటి స్థలం ఇస్తామని తెలిపింది. సింధు కావాలంటే ఆమె అర్హతకు తగ్గ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నగదు పురస్కారంతో పాటు, రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నగదు పురస్కారం ప్రకటించింది. హర్యాణా ప్రభుత్వం 50 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించింది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ 50 లక్షల రూపాయల బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి 10 లక్షల రూపాయలు ఇస్తానని తెలిపారు. సల్మాన్ ఖాన్ లక్షా వెయ్యి రూపాయలు ఇస్తానని అందరికంటే ముందు ప్రకటించాడు. సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా చాముండేశ్వరీ నాథ్ 60 లక్షల రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూ కారు ఇస్తానని ప్రకటించారు. ఒలింపిక్స్ కు వెళ్లేటప్పుడే పతకం సాధించిన వారికి కోటి రూపాయల నజరానా అందిస్తామని కేంద్ర క్రీడాశాఖ ప్రకటించినట్టు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ బహుమతిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 'ఏసు క్రీస్తు', 'సాయి బాబా' పాత్రలతో చేరువైన సినీ నటుడు విజయచందర్ కేసీఆర్ ఫాం హౌస్ కు దగ్గర్లో కరకపట్లలో రెండు ఎకరాల భూమిని సింధు పేరిట రిజిస్ట్రేషన్ చేసి పార్టీ అధినేత జగన్ చేతుల మీదుగా అందజేయనున్నట్టు తెలిపారు.