: 'జమైకా చిరుత' ఉసేన్ బోల్ట్ కు మంత్రి పదవి?
జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ద్వారాలు తెరిచి ఉన్నాయని ఆ దేశ ప్రదాని ఆండ్రూ హోల్నెస్ తెలిపారు. బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమైకా కీర్తిప్రతిష్ఠలను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన బోల్ట్ కు రాజకీయ ద్వారాలు తెరిచి ఉన్నాయన్నారు. బోల్ట్ ప్రదర్శనతో జమైకా ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆయన చెప్పారు. జమైకాకు ఎన్నో రికార్డులు సాధించిన బోల్ట్ సేవలను, పేరును ఉపయోగించుకోవడం తమకు చాలా ముఖ్యమైన అంశమని ఆయన చెప్పారు. బోల్ట్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ ఉసేన్ బోల్ట్ మంత్రి పదవి కోరుకున్నా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఆదివారం 30వ బర్త్ డే జరుపుకుంటున్న బోల్ట్ ఈ మేరకు ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. జమైకా ప్రజల కోరిక మేరకు ఆయన రాజకీయ రంగప్రవేశం చేయాలని భావిస్తున్నట్టు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. బోల్ట్ రాజకీయ రంగప్రవేశం జరిగితే...ఆటగాడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జమైకన్ గా చరిత్రలో నిలిచిపోతాడు.