: తప్పులను ఎత్తిచూపుతూ నాపై చేసే విమర్శలకే ప్రాధాన్యమిస్తా: రాధికా ఆప్టే
'రక్త చరిత్ర', 'షోర్ ఇన్ ది సిటీ', 'ధోని' (తెలుగు సినిమా) చిత్రాలలో సహజమైన నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రాధికా ఆప్టే. ‘కబాలి’లో సూపర్ స్టార్ రజనీతో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు మీడియాతో మాట్లాడుతూ తన గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పింది. తనకు విమర్శలంటేనే ఇష్టమని, అందుకే వాటిని ఆనందంగా స్వీకరిస్తానని తెలిపింది. తనకు తెలిసినంత వరకు తనపై ప్రతిఒక్కరూ విమర్శలు గుప్పించేవాళ్లేనని, వారిలో కొందరి మాటలనే తాను పట్టించుకుంటానని రాధికా ఆప్టే పేర్కొంది. తప్పులను ఎత్తిచూపుతూ తనపై చేసే విమర్శలకే తాను ప్రాధాన్యమిస్తానని తెలిపింది. తన సినిమా 'బాగుంది' అని చెప్పేవారి కంటే, తనలోని లోపాలను ఎప్పటికప్పుడు చెప్పేవారంటేనే తనకి ఇష్టమని ఆమె చెప్పింది. అటువంటి విమర్శలతో తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుందని, నటనను మరింత బాగా చేసేందుకు ఉపయోగపడతాయని రాధికా ఆప్టే పేర్కొంది. ఇండస్ట్రీ తమను ఎంతో ప్రోత్సహిస్తుందని, దానికి తగ్గట్టే తమలో పోటీతత్వం ఉంటుందని ఆమె చెప్పింది. సినీపరిశ్రమలో తనకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారని, వారు తనను ప్రోత్సహిస్తున్నారని పేర్కొంది.