: కావాలంటే నన్ను 'కుక్క' అని పిలవండి.. కానీ పాకిస్థానీ అని మాత్రం అనొద్దు: బలూచిస్థాన్ శరణార్థి ఆవేదన
బలూచిస్థాన్ శరణార్థి 25 ఏళ్ల మజ్దక్ దిల్షాద్ తన భార్యతో కలిసి న్యూఢిల్లీకి వచ్చాడు. అయితే, తన పాస్‌పోర్టులో తన జన్మస్థలం పాకిస్థాన్‌లోని క్వెట్టా అని ఉంది. దీంతో ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ విషయమై మజ్దక్‌ను ప్రశ్నించారు. తమను ఎన్నో బాధలు పెడుతోన్న పాకిస్థాన్‌లో తాను పుట్టినట్లు అనుమానిస్తుండడంతో మజ్దక్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పాకిస్థానీ కాదనే విషయాన్ని వివరించే క్రమంలో తాను ఆవేదన చెందినట్లు మీడియాకు తెలిపాడు. తనను కుక్క అని అయినా పిలవండి కానీ, పాకిస్థానీ అని మాత్రం అనొద్దని అధికారులతో అన్నట్లు తెలిపాడు. తాను బలూచ్ వాసినని, తాను అక్కడ పుట్టినందుకు ఎన్నో వేధింపులకు గురయినట్లు తెలిపాడు. బలూచిస్థాన్ కు చెందిన వేలమంది ప్రజలు విదేశాలకు తరలివెళ్లారు. బలూచిస్థాన్ వాసులని పాకిస్థాన్ ఆర్మీ వేధింపులకి గురిచేస్తోంది. మజ్దక్ తండ్రిని కూడా అపహరించి చంపేసింది. అతని తల్లిని కూడా ఎన్నో రకాలుగా హింసించింది. వేధింపులు తట్టుకోలేక మజ్దక్ కెనడాకు వెళ్లిపోయాడు. బలూచిస్థాన్ లో స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న పోరాటంపై అవగాహన కల్పించే క్రమంలో ఇటీవలే ఆయన కెనడా నుంచి న్యూఢిల్లీకి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆయన ఇలా ఆవేదన వ్యక్తం చేశాడు. బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతోన్న ఘోరాలపై మాట్లాడినందుకు ఆయన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపాడు. తాను పుట్టిన దేశంలో పాక్ ఆర్మీ జాతుల నిర్మూలనకు పాల్పడుతోందని ఆయన చెప్పాడు. బలూచిస్థాన్ వాసులను పాక్ జాతీయతను ఒప్పుకోవాలని ఆర్మీ బలవంతపెడుతోందని, వారిపై దాడులకు దిగుతూ చంపేస్తోందని ఆయన పేర్కొన్నాడు.