: ‘తుని’ విధ్వంసం కేసు దర్యాప్తు ముమ్మరం!... 40 మందికి సీఐడీ నోటీసులు!
కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటూ కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపు మేరకు కాపులంతా తూర్పు గోదావరి జిల్లా తునికి వేలాదిగా తరలివెళ్లారు. ఆ సందర్భంగా ముద్రగడ వ్యాఖ్యలతో రోడ్డెక్కిన కాపులు ధ్వంసరచనకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం... కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. ఇప్పటికే నాటి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, పోలీసులు రికార్డు చేసిన వీడియోలను పరిశీలించిన సీఐడీ ధ్వంస రచనకు పాల్పడ్డ నిందితులను గుర్తించింది. ఇప్పటికే 13 మంది కాపులను సీఐడీ అరెస్ట్ చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారంతా విడుదలయ్యారు. తాజాగా ఈ కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసిన సీఐడీ... 40 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో ఇఫ్పటికే 27 మంది సీఐడీ ముందు విచారణకు హాజరుకాగా, మిగిలిన వారు నేడో, రేపో విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ధ్వంసరచనకు పాల్పడ్డ కాపులపై కఠిన చర్యలు తప్పవన్న వాదన వినిపిస్తోంది.