: భారతీయ టీవీ సీరియల్ 'కథ' విషయంలో కొట్టుకున్న బంగ్లాదేశీయులు.. వందమందికి గాయాలు
ఓ భారతీయ టీవీ చానల్‌లో ప్రసారమయ్యే సీరియల్ కోసం బంగ్లాదేశీయులు కలబడ్డారు. కత్తులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరపాల్సి వచ్చింది. కిరణ్‌మాల అనే ఫేమస్ బెంగాలీ సీరియల్‌ను చూసేందుకు హబిగంజ్ జిల్లాలో ధోల్ గ్రామంలో ఉన్న రెస్టారెంట్‌కు బుధవారం కొందరు గ్రామస్తులు చేరుకున్నారు. ఈ సీరియల్ చూస్తున్న సమయంలో కథ విషయంలో ప్రారంభమైన చర్చ చివరికి వాగ్వాదానికి దారితీసింది. అనంతరం ఘర్షణగా మారడంతో రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు కత్తులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో వందమందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపు చేసేందుకు రబ్బరు బులెట్లతో కాల్పలు జరిపారు. ఇద్దరి మధ్య ప్రారంభమైన వాగ్వాదం గొడవకు దారితీసినట్టు పోలీసులు తెలిపారు. ఇక గొడవతో రెచ్చిపోయిన ఆందోళనకారులు రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పలువురు నెటిజన్లు ఇండియన్ టీవీ సీరియళ్లపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇండియా చానళ్లను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.