: నందిగామలో వైఎస్ జగన్ కు భారీ షాక్!... పరామర్శకొచ్చి విమర్శలెందుకంటూ నిలదీత!


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా షాకులు తగులుతున్నాయి. మొన్న (గురువారం) పుష్కర స్నానానికంటూ విజయవాడ వెళ్లిన జగన్... పనిలో పనిగా పుష్కరాలకు వచ్చి నీటిలో మునిగిపోయిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు నందిగామ వెళ్లారు. ఈ సందర్భంగా చనిపోయిన విద్యార్థుల్లోని ఒకరైన కూచి లోకేశ్ కుటుంబం వద్దకు ఆయన వెళ్లారు. లోకేశ్ తల్లిదండ్రులను పరామర్శిస్తున్న సందర్భంలోనే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన లోకేశ్ బాబాయి హన్మంతరావు జోక్యం చేసుకున్నారు. ‘ఈ సమయంలో రాజకీయాలు ఎందుకు సార్?’ అంటూ ఆయన జగన్ ను నిలువరించే యత్నం చేశారు. అయినా జగన్ ఏమాత్రం ఆగలేదు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, ప్రభుత్వ పెద్దలు ఇసుక దోపిడీ కారణంగానే నదిలో గుంతలు ఏర్పడ్డాయని జగన్ తనదైన శైలిలో సర్కారుపై విమర్శలు గుప్పించారు. మరోమారు కల్పించుకున్న హన్మంతరావు... జగన్ ను సూటిగా నిలదీశారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యమేమీ లేదని చెప్పిన ఆయన... ఇసుక గుంతలు ఈనాటివి కావని, వైఎస్ హయాంలో ఇసుక వేలం నిర్వహించడంతో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేశారని, ఆ కారణంగానే గుంతలు ఏర్పడ్డాయని ఆయన మండిపడ్డారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్న మీరు ఏం చేస్తారో చెప్పండి? అంటూ ఆయన జగన్ ను నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదుకుంటామని, ఈలోగా తమ పార్టీ వారు వచ్చి సాయమందిస్తారని జగన్ సమాధానమిచ్చారు. పరామర్శకు వచ్చిన తనకు ఇలాంటి ప్రశ్నలేంటని జగన్ కాస్తంత ఇబ్బంది పడ్డారట.

  • Loading...

More Telugu News